ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (APSSDC) మరియు స్కిల్ బి సంస్థ మధ్య అవగాహన ఒప్పందం కుదరింది. ఈ ఒప్పందం ద్వారా బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎం, ఎఎన్ఎం విద్యనభ్యసించే విద్యార్థినులకు జర్మనీ మరియు ఐరోపా దేశాల్లో ఉద్యోగావకాశాలు అందించేందుకు శిక్షణ ఇచ్చే కార్యక్రమం ప్రారంభమవుతోంది.
ఈ సంధర్భంగా, రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఎంఓయూ పై సంతకాలు అయ్యాయి. ఈ సందర్భంగా, నారా లోకేశ్ మాట్లాడుతూ, “జర్మనీలో వృద్ధుల సంరక్షణ మరియు ఆసుపత్రుల్లో నర్సింగ్ అభ్యర్థుల కొరత ఉందని, ఆ దేశంలో నర్సింగ్ విద్యను అభ్యసించిన విద్యార్థినులకు అత్యుత్తమ ఉద్యోగ అవకాశాలు అందే అవకాశం ఉంది” అని తెలిపారు.
స్కిల్ బి ద్వారా జర్మన్ భాషలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించడం, ప్రతి సంవత్సరం 1,000 మంది నర్సింగ్ విద్యార్థినులకు జర్మనీలో అత్యుత్తమ ప్యాకేజీలతో ఉద్యోగాలు కల్పించేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.
స్కిల్ బి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కో-ఫౌండర్ వింజమూరి రవిచంద్ర గౌతమ్ మరియు సీఈఓ ఉజ్వల్ చౌహన్ మాట్లాడుతూ, “మేము ఇప్పటివరకు 10,000 మందికి పైగా విదేశాలలో ఉద్యోగాలు కల్పించామని, మా సంస్థ జర్మనీ, పోలాండ్, హంగేరీ, లిథువేనియా, లాట్వియా మరియు ఇతర తూర్పు ఐరోపా దేశాలలో అభ్యర్థులను రిక్రూట్ చేస్తున్నామని చెప్పారు. మేము బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎం, ఎఎన్ఎం గ్రాడ్యుయేషన్ చేసిన నర్సులకు జర్మన్ భాషలో ఉచిత శిక్షణ అందించి, ఉద్యోగాల అవకాశాలను కల్పిస్తాం” అని వారు తెలిపారు.
ఈ కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నైపుణ్య రాజధానిగా మారేందుకు తమ లక్ష్యాన్ని చేరుకోవాలని స్కిల్ బి సంస్థ ప్రణాళికలు వేసిందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ అండ్ ట్రైనింగ్ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్, ఏపీఎస్ఎస్‌డీసీ సీఈఓ గణేశ్ కుమార్, ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ మనోహర్, మెడిక్రూటర్ ఎండీ రోనాల్డ్ రెస్కే తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం జర్మనీ మరియు ఐరోపా దేశాలలో ఉద్యోగ అవకాశాలను అందించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నర్సింగ్ విద్యార్థినులకు అవకాశాలను పెంచేందుకు ఒక కీలక అంగీకారాన్ని సూచిస్తోంది.