వ్యక్తులను… అన్య మతాలను లక్ష్యంగా చేసుకొని మాట్లాడవద్దు
• జగన్ తిరుమల యాత్రలో డిక్లరేషన్ అనేది టీటీడీ చూసుకొనే ప్రక్రియ
• ఆ ప్రక్రియపై కూటమి పక్షాలు ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు
• తుని, కోనసీమ ఘటనలతో కులాల చిచ్చు రగిలించాలని చూసిన వైసీపీ ఇప్పుడు మతం మంటలు రేపాలని చూస్తోంది
• పోలీసులు… ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
తిరుమల మహా ప్రసాదం లడ్డూ తయారీలో జంతు అవశేషాలు కలిపిన నెయ్యి వినియోగించి అపవిత్రం చేయడానికి కారకులు, అలాంటి నెయ్యి సరఫరాకు అనుమతులు మంజూరు చేసిన టీటీడీ బోర్డు సభ్యులు బాధ్యత వహించాలి. నాటి టీటీడీ బోర్డులను నియమించినవాళ్ళూ బాధ్యులే. హిందువులు పరమ పవిత్రంగా భావించే లడ్డూలో కల్తీపై వారే సమాధానం చెప్పాలి. తిరుమల దర్శనానికి వెళ్లాలని నిర్ణయించుకున్న నాటి ముఖ్యమంత్రి శ్రీ జగన్ విషయంలో ఆయన మతాన్ని, ఆయన పర్యటనను లక్ష్యంగా చేసుకొని మాట్లాడాల్సిన సమయం కాదిది. వ్యక్తులను, అన్య మతాలను లక్ష్యంగా చేసుకోవద్దు.
ఇక్కడ తిరుమల ప్రసాదం అపవిత్రం కావడం, ఆలయ ఆచారాలకు భంగం వాటిల్లేలా టీటీడీ పాలక మండలి నిర్ణయాలు తీసుకోవడం అనేది హిందువుల అంతర్గత వ్యవహారం. హిందూ ధర్మాన్ని కాపాడతామని బాధ్యత తీసుకొన్నవారే అందుకు విరుద్ధంగా వెళ్లినందున వారిని ప్రశ్నించాలి. తిరుమలలో ధర్మాన్ని కాపాడతామని బాధ్యత తీసుకున్నది శ్రీ వైవీ సుబ్బారెడ్డి, ఆ తరువాత శ్రీ కరుణాకర రెడ్డి. ఆ సమయంలో అక్కడ ఉన్నతాధికారిగా ఉన్నది శ్రీ ధర్మారెడ్డి. తొలుత ఈ ముగ్గురూ తిరుమల లడ్డూ అపవిత్రతకు గురైన అంశంపై సమాధానం చెప్పాలి. శిక్షలు ఎవరికి, ఎలా పడాలి అనేది విచారణలో తేలుతుంది. ఆపై శిక్షలు అనేవి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి చూసుకుంటాడు.
• వైసీపీ కోరుకొంటున్న గొడవలు ఇవ్వవద్దు
తిరుమల యాత్రకు వెళ్తున్న శ్రీ జగన్ నుంచి డిక్లరేషన్ తీసుకోవడం అనేది టీటీడీ అధికారుల బాధ్యత. ఈ విషయంపై కూటమి పక్షాలు ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. డిక్లరేషన్ ఇస్తారా లేదా… ఆలయ సంప్రదాయాలు, మర్యాదలు, నిబంధనలు పాటిస్తారా లేదా అనేది వెళ్ళే వ్యక్తి విచక్షణకు వదిలేయాలి. అధికారులూ బాధ్యత గుర్తెరగాలి. ఈ విషయంలో సదరు వ్యక్తుల తరఫువాళ్ళు కోరుకొనేది గొడవలే.
ఎందుకంటే వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా తుని ఘటన, అధికారంలోకి వచ్చాక కోనసీమ ఘటన సృష్టించింది. కులాల మధ్య చిచ్చు రేపి ప్రయోజనం పొందాలని చూసింది. ఇప్పుడు మతాల మంట రేపాలని చూస్తోంది. తుని, కోనసీమ ఘటనల్లో ప్రజలు ఎంతో సంయమనంతో వ్యవహరించారు. ఈ తరుణంలోనూ వైసీపీ కుత్సిత పన్నాగాల విషయంలో అంతే అప్రమత్తంగా ఉండాలని కోరుకొంటున్నాను. వాళ్ళు కోరుకొంటున్న గొడవలు మనం ఇవ్వవద్దు. మతాల మధ్య గొడవలు సృష్టించాలనే ఆలోచనల్లో ఉన్న వైసీపీ వ్యవహార శైలిపట్ల – పోలీసు శాఖ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను.


Discover more from Elite Media Telugu News

Subscribe to get the latest posts sent to your email.

Discover more from Elite Media Telugu News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading