మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు సౌకర్యం కల్పించేందుకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు.
ఈ నెల 26వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా శివాలయాలకు భక్తులు భారీగా తరలివస్తారని అంచనా వేసింది. వేములవాడ, కీసర, శ్రీశైలం, ఏడుపాయల, పాలకుర్తి వంటి పుణ్యక్షేత్రాలకు పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులకు సూచించారు.
ఈ రోజు తన నివాసంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా వేములవాడ, శ్రీశైలం, కీసర, పాలకుర్తి, ఏడుపాయల దేవాలయాలకు ప్రత్యేక బస్సులను నడపాలని ఆయన ఆదేశించారు. బస్టాండ్‌ల వద్ద రద్దీ ఎక్కువగా ఉంటే, ఆ పరిస్థితికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని కూడా మంత్రి సూచించారు.
ప్రజలకు ఏ రకమైన అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా, రవాణా సేవలు సమర్థవంతంగా అందించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు.
భక్తులు మహాశివరాత్రి పర్వదినాన్ని సక్రమంగా, భద్రంగా జరుపుకునేందుకు ఈ ప్రత్యేక బస్సులు కీలక పాత్ర పోషించనున్నాయి.