తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికపై వైసీపీ నేత రోజా తీవ్ర వ్యాఖ్యలు

తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పదవి టీడీపీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై వైసీపీ నేత, మాజీ మంత్రి రోజా తీవ్రస్థాయిలో స్పందించారు. తిరుపతి నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నికలను ప్రజాస్వామ్య ఓటమిగా ముద్రించి, టీడీపీ అభ్యర్థి గెలుపు పై తీవ్ర ఆక్షేపాలు చేశారు.

“ప్రజాస్వామ్యానికి కించపరిచిన ఈ ఎన్నికలు, ఓటమి మనది కాదు… ఇది వ్యవస్థల ఉదాసీన వైఖరితో, అధికార దుర్వినియోగంతో గెలిచిన వారిదే” అని రోజా వ్యాఖ్యానించారు. టీడీపీ కార్పొరేటర్ ఒక్క ఓటుతో గెలిచిన విషయంపై ఆమె వ్యంగ్యంగా స్పందించారు.

ఈ సందర్భంగా రోజా, “మేం విప్ జారీ చేశాం. విప్ ధిక్కరించిన మా సభ్యులను రిటర్నింగ్ అధికారి అనర్హులుగా ప్రకటించాలి… కానీ అలా జరగలేదు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక ఎలా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు” అని పరోక్షంగా ఎన్నికల వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీషను విధి నిర్వహణలో అవమానించడం, కార్పొరేషన్ సమావేశం జరుగుతుండగా శిరీష ఆందోళనకు దిగిన విషయాన్ని కూడా రోజా గుర్తు చేశారు. “ఇలాంటి పరిణామాలు ఏం సూచిస్తున్నాయి?” అని ఆమె ప్రశ్నించారు.

రాజకీయ సంఘర్షణలకు సంబంధించి, “తిరుపతి ఎంపీ గురుమూర్తి ప్రయాణిస్తున్న బస్సుపై దాడి, వైసీపీ కార్పొరేటర్లు నేడు రాకపోవడం, నిన్న మాతో వచ్చి, నేడు వ్యతిరేకంగా ఓటు వేయడం” వంటి పరిణామాలను ఆమె మరింత ప్రస్తావించారు.

మరో వైపు, రోజా సమయం వచ్చినప్పుడు స్వామివారి, ప్రజల సహాయంతో సమాధానం ఇస్తామన్న నమ్మకం వ్యక్తం చేశారు. “మేం ఓడిపోయి గెలిచాం… వాళ్లు గెలిచే అవకాశం కల్పించి, ఓడిపోయారు” అంటూ చివరగా ఆమె స్పష్టం చేశారు.

ఈ వ్యాఖ్యలు తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాగ్వివాదాలను మరింత పెల్లుబుకుతాయని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలయ్యింది.

తాజా వార్తలు