ఒక అరటిపండు ధర రూ.100 అంటే నమ్మశక్యంగా లేదేమో. కానీ హైదరాబాద్ నగరంలో ఓ రష్యన్ యాత్రికుడికి ఇదే అనుభవం ఎదురైంది. స్థానిక తోపుడు బండ్ల వ్యాపారి ఒక్క అరటిపండు ధర వంద రూపాయలుగా చెప్పడం అతడిని ఆశ్చర్యంలో ముంచెత్తింది.

సోషల్ మీడియాలో వైరల్ వీడియో
ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను ఆ రష్యన్ యాత్రికుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వీడియోలో, తన అనుభవాన్ని “క్రేజీ ప్రైస్” అంటూ వివరిస్తూ, ఈ ధరకు యూకేలో ఎనిమిది అరటిపండ్లు కొనుగోలు చేయవచ్చని పేర్కొన్నాడు.

వీడియో ప్రకారం, రష్యన్ యాత్రికుడు తోపుడు బండ్ల వ్యాపారి వద్దకు వెళ్లి నమస్కారం చెబుతూ, ఒక అరటిపండు ధర అడిగాడు. దీనికి వ్యాపారి “రూ.100” అని సమాధానం ఇచ్చాడు. అంత ధర ఎక్కువగా ఉందని యాత్రికుడు పలుమార్లు ప్రశ్నించినప్పటికీ, వ్యాపారి అదే ధరను కరాఖండీగా చెప్పాడు.

భారీ ధరపై విమర్శలు
ఈ ఘటనపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. “విదేశీయుల్ని చూసి ఎక్కువ ధర చెప్పడం సరికాదు”, “ఇది హైదరాబాద్‌కి మంచిపేరు తేలేదు” అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు, “ఆ వ్యాపారి సరదాగా చెప్పివుండొచ్చు”, “ఆ యాత్రికుడికి భాషా గందరగోళం వచ్చిందేమో” అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

మార్కెట్‌లో అసలు ధర ఎంత?
ప్రస్తుతం హైదరాబాద్‌లో డజన్ (12) అరటిపండ్ల ధర రూ.60 నుంచి రూ.80 మధ్య ఉంది. అంటే, ఒక్క అరటిపండు గరిష్ఠంగా రూ.7-8 మాత్రమే అవుతుంది.

ఈ సంఘటన సరదాగా జరిగినదా? లేక విదేశీయుల్ని మోసం చేయాలనే ఉద్దేశంతో జరిగిందా? అనేది తెలియదు. అయితే, ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.