ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దులో రెండు రోజుల క్రితం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 17 మంది మావోయిస్టులు మృతి చెందడం తెలిసిందే. ఈ ఘటనలో మావోయిస్టు అగ్రనేత బడే చొక్కారావు అలియాస్ దామోదర్ కూడా హతమైనట్లు తాజాగా గుర్తించారు. ఈ మృతి మావోయిస్టు ఉద్యమానికి భారీ ఎదురుదెబ్బగా భద్రతా వర్గాలు భావిస్తున్నాయి.
మావోయిస్టు ఉద్యమంలో కీలక వ్యక్తి
బడే చొక్కారావు తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించేవాడు. గత మూడు దశాబ్దాలుగా నక్సల్ ఉద్యమంలో కీలకపాత్ర పోషిస్తూ భద్రతా బలగాలకు మోస్ట్ వాంటెడ్ నక్సల్ గా మారాడు.
చొక్కారావు స్వస్థలం తెలంగాణ రాష్ట్రం, ములుగు జిల్లా, కాల్వపల్లి గ్రామం. చిన్నతనం నుంచే మావోయిస్టు భావజాలం ఆకర్షించడంతో ఉద్యమంలో చేరాడు. పెద్దగా చదువులు రాకపోయినా, టెక్నాలజీపై మంచి పట్టుతో మావోయిస్టు కార్యకలాపాలను సమర్థంగా నిర్వహించేవాడు.
హరిభూషణ్ మృతితో కీలక పదవి
ఇంతకుముందు తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా హరిభూషణ్ ఉన్నాడు. అతడు కరోనాతో 2021లో మరణించడంతో, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ బడే చొక్కారావును ఆ స్థానంలో నియమించింది.
భార్య రజిత కూడా నక్సలైట్ – 2023లో అరెస్ట్
చొక్కారావు భార్య రజిత కూడా నక్సలైట్ ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొంది. అయితే 2023లో భద్రతా బలగాలు ఆమెను అరెస్ట్ చేసినట్లు సమాచారం.
భద్రతా బలగాలకు విజయంగా భావిస్తున్న ఎన్‌కౌంటర్
బదే చొక్కారావు మృతితో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టేనని అధికారులు అంటున్నారు. భద్రతా బలగాలు మిగతా మావోయిస్టుల పట్టుబాటుకు చర్యలు వేగవంతం చేశాయి.
ఈ ఎన్‌కౌంటర్ అనంతరం, మావోయిస్టు కార్యకలాపాలు మరింత క్షీణిస్తాయని భద్రతా వర్గాలు అంచనా వేస్తున్నాయి.