ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి తన సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోదీ పై తీవ్ర ఆరోపణలు చేస్తూ, తెలంగాణలో బీసీ రాజ్యాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ రోజు వరంగల్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, తెలంగాణ ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులతో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర అప్పులను పెంచుతూ ప్రజలను భయపెడుతోందని విమర్శించారు.
పొంగులేటి అడ్డుకున్నారన్న ఆరోపణ
కేఏ పాల్ మాట్లాడుతూ, తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తనను వరంగల్‌లో మీట్ ది ప్రెస్ సమావేశం నిర్వహించకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. తాను సదాశివపేటను అభివృద్ధి చేసినట్లుగానే వరంగల్ జిల్లాను అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు.
గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రజాశాంతికి మద్దతివ్వాలని పిలుపు
రానున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 100 రోజుల్లో ఉచిత విద్య, వైద్యం అందిస్తామన్నారు. తెలంగాణలో ఇన్వెస్టర్లను పక్కన పెట్టి అదానీకి అన్నీ కట్టబెడుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
రెడ్ల పార్టీలు, బీసీల రాజకీయ భవిష్యత్
తెలంగాణలో రెడ్ల పార్టీలు బీసీలకు అన్యాయం చేస్తున్నాయంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. “బీసీలు కాంగ్రెస్, బీజేపీ నుంచి బయటకు రావాలి. మోదీ, రేవంత్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోవాలి” అంటూ పిలుపునిచ్చారు.
తాను సీఎం కావడం ఖాయం – కేఏ పాల్
రాబోయే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ గెలుస్తుందని, తానే తెలంగాణ ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపడతానని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో మార్పు తేవడానికి ప్రజాశాంతి పార్టీనే ఒకటే ప్రత్యామ్నాయమని ప్రకటించారు.
ఈ వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ ప్రారంభమైంది.