తిరుపతి, 9 జనవరి 2025 – తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం జరిగిన తొక్కిసలాటపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఈ ఘటనలో అనేక మంది భక్తులు ప్రాణాలు కోల్పోవడం పై సిఎం తీవ్ర శోకాన్ని వ్యక్తం చేశారు.
సిఎం సమీక్ష సమావేశంలో డీజీపీ, టీటీడీ ఈవో, జిల్లా కలెక్టర్, ఎస్పీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం చంద్రబాబు మాట్లాడుతూ, “దేవుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. వారి కుటుంబాలకు నా లోతైన సానుభూతి తెలుపుకుంటున్నాను” అన్నారు.
విశాఖలో మంచి కార్యక్రమం పూర్తి చేసుకున్న సమయంలో తిరుపతిలో జరిగిన ఈ ఘటన తనకు తీవ్ర ఆవేదనను కలిగించిందని తెలిపారు. “భక్తుల సంఖ్య అధికంగా ఉండడాన్ని తెలిసినప్పటికీ, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయకపోవడం చాలా దురదృష్టకరం” అని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
“ఇలాంటి సందర్భాల్లో అధికారులు ఎంతో అప్రమత్తంగా, బాధ్యతగా ఉండాలి. వారు నియమాలు పాటించడంలో విఫలమయ్యారు. దీన్ని ఎలా అంగీకరించగలం?” అని సిఎం ప్రశ్నించారు.
మృతుల సంఖ్య పెరగకుండా, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను సిఎం ఆదేశించారు. ప్రస్తుతం క్షతగాత్రులకు అందిస్తున్న వైద్య సేవలపై జిల్లా అధికారులు వివరాలు వెల్లడించారు.
“టీటీడీ టోకెన్లు ఇచ్చే కౌంటర్ల నిర్వహణ మరియు భద్రతను పున:సమీక్షించాలని” సిఎం సూచించారు.
రేపు ఉదయం తిరుపతికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.