The Union Minister of Coal and Mines, Shri G. Kishan Reddy attends the release meeting of the guidelines for the rejuvenation of traditional water bodies in coal and lignite mining regions held at Shastri Bhawan, in New Delhi on August 01, 2024.
కలియుగ ప్రత్యక్ష దైవం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల కొంగు బంగారం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందన్న సమాచారం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. ఏటా కోట్ల మంది దర్శించుకునే తిరుపతి వెంకన్న లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేయడం అనేది ప్రజల విశ్వాసానికి తూట్లు పొడవడమే. హిందువుల, ముఖ్యంగా శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీయడమే. ఇది క్షమార్హం ఎంత మాత్రం కాదు. కోట్లాది మంది మనోభావాలను దెబ్బతీసిన నేరస్థులకు తగిన శిక్ష పడాలి. ఈ దిశగా పోలీసు యంత్రాంగం, దర్యాప్తు సంస్థలు ముందుకు వెళ్తున్నాయని ఆశిస్తున్నాను.
తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా, దేశవిదేశాల నుంచి నిత్యం లక్షలాది భక్తులు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. పరమ పవిత్రమైన, ఎంతో ప్రశస్తమైన లడ్డూ ప్రసాదాన్ని సేవిస్తారు. అప్పుడే తమ దైవ దర్శనం పూర్తయిందని భక్తులు భావిస్తారు. ఇంత పవిత్రంగా భావించే ఈ లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వులను, చేపనూనెలను వినియోగించడం క్షమించరాని నేరం. ఇలాంటి దురాగతానికి బాధ్యులైన వారందరినీ గుర్తించి, తగిన శిక్ష పడేలా చేయాలి. భవిష్యత్తులోనూ ఇలాంటి ఘటనలేవీ పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాలి. దీంతో పాటు తిరుపతిలో అన్య మత ప్రచారం, తిరుమల కొండపైకి మద్యం, మాంసాహారాన్ని తీసుకెళ్లడం, టీటీడీలో అవినీతి అక్రమాలు గత కొన్నేళ్లుగా పతాక శీర్షికలవుతున్నాయి. సనాతన ధర్మాన్ని, హిందూ ధార్మిక విశ్వాసాలను దెబ్బతీసే కుట్ర గతంలో జరిగిన నేపథ్యంలో వీటన్నింటిపై సమగ్ర దర్యాప్తు జరిపించి, బాధ్యులను శిక్షించి, తిరుమల పవిత్రతను కాపాడే, భక్తుల మనోభావాలను పరిరక్షించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను.
కోట్లాది భక్తుల మనోభావాలతో ముడిపడిన ఈ అంశాన్ని సంచలనాత్మకంగా మార్చవద్దని రాజకీయ పార్టీలకు, ధార్మిక సంస్థలకు విజ్ఞప్తి చేస్తున్నాను. పదేపదే తిరుమల లడ్డూ ప్రసాదం అపవిత్రమైందన్న వార్తలు భక్తుల నమ్మకం, విశ్వాసం సడలే ప్రమాదం ఉంది. ఈ విషయంలో బాధ్యతతో వ్యవహరించి సంయమనం పాటించాలి. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి నిత్యం వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే లక్షలాది భక్తుల విశ్వాసాన్ని నిలబెట్టేందుకు, వారి మనోభావాలను పరిరక్షించేందుకు కృషి చేయాలి.
కార్యాలయ కార్యదర్శి
