విశాఖపట్నంలో నేడు నిర్వహించిన నేవీ డే వేడుకలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంలో తన ప్రసంగంలో ఆయన విశాఖపట్నం నగరాన్ని ఆర్థిక రాజధానిగా అభివర్ణించారు. త్వరలోనే విశాఖపట్నం నగరానికి మెట్రో రైలు సేవలు అందుబాటులోకి వస్తాయని చంద్రబాబు వెల్లడించారు.

విశాఖ నగరాన్ని ప్రశాంతతకు మరోపేరుగా పేర్కొన్న ఆయన, ఈ నగరాన్ని టెక్నాలజీ హబ్‌గా మార్చడం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. విశాఖపట్నం అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న చంద్రబాబు, నగరాన్ని ప్రపంచస్థాయి మేధో కేంద్రంగా తీర్చిదిద్దేందుకు పలు ప్రణాళికలు అమలులో ఉన్నాయని వివరించారు.

నేవీ విన్యాసాలకు ప్రశంసలు
ఈ వేడుకల్లో భాగంగా విశాఖ సాగరతీరంలో భారత నావికాదళం నిర్వహించిన విన్యాసాలు కళ్లు చెదిరేలా ఉన్నాయని చంద్రబాబు కొనియాడారు. నేవీ సిబ్బందిలోని క్రమశిక్షణ, సామర్థ్యాలను ప్రశంసిస్తూ, వారు చూపిస్తున్న నిబద్ధత చూసి ముచ్చటేసిందని చెప్పారు.

హుద్ హుద్ తుపానులో నేవీ సేవలు
చంద్రబాబు తన ప్రసంగంలో గతంలో హుద్ హుద్ తుపాను వల్ల జరిగిన నష్టం సందర్భంగా నేవీ అందించిన సహాయాన్ని గుర్తు చేసుకున్నారు. తుపాను సమయంలో నేవీ చేసిన సేవలు మరువలేనివని, ఆ సమయంలో అందించిన మద్దతు రాష్ట్రానికి ఎంతో అండగా నిలిచిందని ఆయన అన్నారు.

ఈ వేడుకల్లో నేవీ అధికారుల తో పాటు పలువురు ముఖ్య వ్యక్తులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.