Special Stories

తెలంగాణలో రైతు పథకాలపై పెద్ద జోరు వార్ – కాంగ్రెస్, BRS మధ్య విమర్శల యుద్ధం..



తెలంగాణ రాష్ట్రంలో రైతు పథకాలకు సంబంధించి తీవ్ర రాజకీయ పోరు నడుస్తోంది. గతంలో BRS ప్రభుత్వం చేపట్టిన రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలతో పోలిస్తే, కాంగ్రెస్ అధికారం లోకి రాగానే కొత్త హామీలు ఇచ్చినా, వాటి అమలు లో ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రైతుల ఆశలు గల్లంతు?

BRS హయాంలో రైతులకు ఎకరానికి రూ. 10,000 రైతు బంధు అందించగా, కాంగ్రెస్ అధికారం లోకి వస్తే రూ. 15,000 ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ, ఖరీఫ్ సీజన్ ముగిసినా ఇప్పటి వరకు ఆ నిధులు రైతుల ఖాతాల్లోకి చేరకపోవడం, ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులను కారణంగా చూపుతుండటం రైతులను నిరాశకు గురిచేస్తోంది.

CM రేవంత్ రెడ్డి పై విమర్శలు

రుణమాఫీ హామీని కూడా పూర్తిగా అమలు చేయలేకపోయినందుకు సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. వాస్తవానికి ఈ రుణమాఫీ దేశంలో కేవలం 30% మంది రైతులకు మాత్రమే అందిందని, రైతులు ఆరోపిస్తున్నారు. పథకాలు ఆలస్యమవుతుండటంతో, ప్రభుత్వం ప్రతిపక్ష విమర్శలను ఎదుర్కోవడానికి ‘డైవర్ట్ రాజకీయాలు’ చేస్తున్నట్లు అనిపిస్తుందని, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

BRS నాయకుల తీవ్ర విమర్శలు

BRS నేతలు రైతుల మీద కాంగ్రెస్ వంచన చేసిందని తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. “మేము అధికారంలో ఉన్నప్పుడు రైతు బంధు, రైతు బీమా వంటి పథకాల ద్వారా రైతులకు ఆర్థిక భరోసా కల్పించాం. కానీ కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి పథకాల అమలు నిలిచిపోయింది. రుణమాఫీ పేరుతో కేవలం 2 లక్షల వరకే మాఫీ జరిగింది. అందులోనూ తక్కువమంది రైతులకే మాఫీ వరించింది” అని వారు ఆరోపిస్తున్నారు.

రాష్ట్రంలో అల్లర్లు – దారి మళ్లింపు రాజకీయాలా?

ఇక, రైతు సమస్యలను పక్కన పెట్టి, గాంధీ, కౌశిక్ రెడ్డి వ్యవహారంపై దృష్టి కేంద్రీకరించడం ద్వారా సీఎం రేవంత్ రెడ్డి డైవర్ట్ రాజకీయాలకు దిగుతున్నారని BRS ఆరోపిస్తోంది. ఇది కూడా అధికారంలో ఉన్న కాంగ్రెస్ మాయ మాటలలో ఒక భాగమని, వారికి ఆర్థిక పరిస్థితులపై అవగాహన లేదని పేర్కొంటోంది.

రైతుల ఆవేదన – ప్రజాభిప్రాయం

ఇప్పటికి పది నెలలు కాకముందే రైతులు ప్రభుత్వం తీరును ఎదురుతిరుగుతున్నారని, ఈ ప్రతిష్టంభనకు సమాధానం రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఇస్తారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

తుది మాట

తెలంగాణలో రైతుల పథకాల అమలుపై BRS, కాంగ్రెస్ మధ్య ఈ మాటల యుద్ధం ఇంకా ఎక్కడికి దారితీయనుందో వేచిచూడాలి.