హైదరాబాద్: టీవీ సీరియల్ నటిని వేధించిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన 29 ఏళ్ల మహిళ యూసుఫ్‌గూడలో తన పిల్లలతో ఉంటోంది. గత ఏడాది సెప్టెంబర్‌లో ఓ సీరియల్ షూటింగ్ సమయంలో ఫణితేజ అనే యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం క్రమంగా స్నేహంగా మారింది.
రెండు నెలల క్రితం అతను పెళ్లి చేసుకుంటానని చెప్పగా, తనకు ఇప్పటికే పెళ్లైందని, ఇద్దరు పిల్లలు ఉన్నారని ఆమె నిరాకరించింది. దీంతో, ఫణితేజ ప్రేమ, పెళ్లి పేరుతో ఆమెను వేధించడం ప్రారంభించాడు. అసభ్యకర సందేశాలు, వీడియోలు పంపిస్తూ వేధింపులు చేశాడు.
అంతటితో ఆగకుండా, ఆమె అత్తింటి చిరునామా తెలుసుకొని, అక్కడకెళ్లి ఆమెపై చెడు వ్యాఖ్యలు చేశాడు. వేధింపులు భరించలేక, బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు చేసిన విషయమై అతను బాధితురాలికి సెల్ఫీ వీడియో పంపించి తన చర్యలకు బాధ్యత వహిస్తున్నట్లు చెప్పాడు.
పోలీసులు కేసు నమోదు చేసి, ఫణితేజను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.