జనవరి 4న తెలంగాణ కేబినెట్ సమావేశం

తెలంగాణ కేబినెట్ సమావేశం జనవరి 4న సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో జరుగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో రైతు భరోసా, భూమిలేని పేదలకు నగదు, కొత్త రేషన్ కార్డులు, టూరిజం పాలసీ వంటి ముఖ్య అంశాలపై చర్చించే అవకాశముంది.

సంక్రాంతి పండుగ తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేయాలని సీఎం ఇప్పటికే ప్రకటించగా, ఈ కేబినెట్ సమావేశంలో దీనిపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కొత్త రేషన్ కార్డులకు ఆదాయ పరిమితి, దరఖాస్తుల స్వీకరణ విధానాలపై చర్చించి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం లబ్ధిదారులకు సబ్సిడీ రేట్లతో ఇసుక, సిమెంట్, స్టీల్ సరఫరా చేయాలనే ప్రతిపాదనపై చర్చ జరుగనుంది. విద్యుత్ కమిషన్, బీసీ డెడికేటెడ్ కమిషన్, ఎస్సీ వర్గీకరణ కమిషన్ నివేదికలపై కూడా చర్చించనున్నారు.

ఇదివరకే ప్రతిపాదించిన యాదగిరిగుట్ట దేవాలయానికి టీటీడీ తరహా బోర్డును ఏర్పాటు చేసే అంశంపై కేబినెట్ ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.






తాజా వార్తలు