తెలంగాణా ప్రభుత్వంతో టాలీవుడ్ ప్రముఖుల భేటీలో అనేక అంశాల ప్రస్తావన వచ్చాయి . సమావేశం లో సినీ ప్రముఖులకు తమ వైఖరి స్పష్టం చేసిన ప్రభుత్వం, చిత్ర పరిశ్రమ అబివృద్దికి కట్టుబడి ఉన్నామని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ లో అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. సినీ పరిశ్రమ అభివృద్ధి మొదలు, గద్దర్ అవార్డ్స్ సహా పలు అంశాలపై సీఎం, సినీ పెద్దల మధ్య చర్చలు నడిచాయి. ఇప్పటికే బెనిఫిట్ షోలు ఉండవని సీఎం చెప్పడంతో దానికి సంబందించిన చర్చ పెద్దగా జరిగింది లేదు. ఈ సందర్భంగా సంధ్య థియేటర్ ఘటనను సీఎం ప్రస్తావిస్తూ… శాంతిభద్రతల విషయంలో రాజీపడేది లేదని సినీ పెద్దలకు ఆయన స్పష్టం చేశారు. ఇకపై బౌన్సర్ల విషయంలో సీరియస్‌గా ఉంటామని తెలిపారు. అభిమానుల్ని కంట్రోల్‌ చేయాల్సిన బాధ్యత కూడా సెలబ్రిటీలదే అని చెప్పారు. టెంపుల్‌ టూరిజం, ఎకో టూరిజంను ప్రమోట్ చేయాలని వారికి స్పష్టం చేశారు. ఇన్వెస్ట్‌మెంట్ల విషయంలోనూ ఇండస్ట్రీ సహకరించాలని చెప్పుకొచ్చారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు నరేందర్ రెడ్డి, ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు, నిర్మాత అల్లు అరవింద్, హీరోలు వెంకటేశ్, నాగార్జున సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

ఇండస్ట్రీ పెద్దలకు సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు కూడా ఇచ్చారు . తెలుగు సినిమా పరిశ్రమకు ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు. పరిశ్రమ బాగుండాలని కోరుకున్నట్లు. ఐటీ, ఫార్మాతోపాటు చిత్ర పరిశ్రమ అభివృద్ధి కూడా తమకు ముఖ్యం అనే విషయాన్ని స్పష్టం చేశారు. పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయటంతో పాటు… సినీ పరిశ్రమ సైతం కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

సమావేశం అనంతరం మాట్లాడిన ఎఫ్ డి సి చైర్మన్ దిల్ రాజు సినిమా టికెట్ రేట్లు పెంపు, బెనిఫిట్ షోలు, సంక్రాంతికి విడుదల కాబోతోన్న సినిమాలు ముఖ్యం కాదని దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశ మయ్యాయి. టాలీవుడ్ అభివృద్ధి పైనే చర్చ జరిగిందని దేశంలో తెలుగు సినిమాకు ఓ గౌరవం అందుతోందని, తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లేందుకు పరిశ్రమ, ప్రభుత్వం కలిసి పనిచేయాలని నిర్ణయించామన్నారు.హైదరాబాద్‌లో హాలీవుడ్ సినిమా షూటింగ్‌లు జరిగేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారని ..సంధ్య థియేటర్ ఘటన నేపథ్యంలో టాలీవుడ్కు, ప్రభుత్వానికి గ్యాప్ వచ్చిందన్న ప్రచారం సరికాదని, అలాంటిదేమీ లేదని , దిల్ రాజు చెప్పారు. సీఎంతో సానుకూల వాతావరణంలో సమావేశం జరిగిందన్నారు. డ్రగ్స్పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఫోకస్ పెట్టమని సీఎం కోరారని, హీరోలు, హీరోయిన్స్ ఆ కార్యక్రమాలకు సహకరిస్తారని సీఎంకు తెలిపినట్లు దిల్ రాజు వెల్లడించారు. మొత్తానికి గత కొన్ని రోజులుగా ఇటు టాలీవుడ్ అటు రేవంత్ టార్గెట్ గా జరుగుతున్న ప్రచారాలకు ఈ సమావేశంతో పలు స్టాప్ పడినట్లయింది.‌ ఇక భేటీలో పాల్గొన్న నాగార్జున ,సిఎం రేవంత్ కు శాలువా కప్పిన వీడియో సోషల్ మీడయాలో వైరల్ అయింది.