ఒక షాపుకి వెళ్లి వస్తువు కొనాలనుకునేటప్పుడు.. దాన్ని ఒకటికి పదిసార్లు చెక్ చేసుకుంటాం. అదే ఆన్ లైన్ షాపింగ్ లేదా ఏదైనా టూర్ కి వెళ్లినప్పుడు హోటల్ బుక్ చేసుకోవాలి అంటే.. మొదటి మనం చూసేది రివ్యూలనే. 5 స్టార్ రేటింగ్ లేదా.. 4 ,5 రేటింగ్స్ కు మధ్యలో ఉన్న వాటిని మనం ఎంపిక చేసుకుంటూ ఉంటాం. ఈ మధ్య కాలంలో రేటింగ్ లను చూసి కొనుగోలు చేయ్యడం అధికంగా పెరిగిపోయింది. దీన్ని అదునుగా భావించిన కొందరు విక్రయదారులు నకిలీ రివ్యూలతో యూజర్లను తప్పుదోవ పట్టిస్తున్నట్లు కేంద్రం గుర్తించింది.
నకిలీ రివ్యూల కట్టడికి కొత్తగా మార్గదర్శకాలు రూపొందించింది. వీటిని వచ్చేవారం ప్రచురించనున్నట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ తెలిపారు. ఇకపై ఈ-కామర్స్, హోటళ్లు, విహారయాత్ర వెబ్సైట్లు వంటి వాటికి ఇచ్చే రివ్యూలను పరిశీలించి, యూజర్లకు నిజమైన సమాచారం అందించేలా వీటిని రూపొందించినట్లు తెలిపారు. భారత్ లో ఈ-కామర్స్ సంస్థలు అనుసరిస్తున్న విధివిధానాలకు అనుగుణంగా, ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న పద్ధతులను అధ్యయనం చేసి, స్టేక్ హోల్డర్లతో సమావేశం అనంతరం వినియోగదారుల వ్యవహారాల విభాగం నకిలీ రివ్యూల పరిశీలనకు మార్గదర్శకాలను రూపొందించింది.
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వచ్చేవారంలో వీటిని ప్రచురించనుంది. నకిలీ రివ్యూల కట్టడికి మార్గదర్శకాలను రూపొందించిన తొలి దేశం భారత్ అవుతుంది. తొలుత ఈ ప్రక్రియ స్వచ్చందంగా జరుగుతుంది. తర్వాత ఇది తప్పనిసరి చేయనున్నాం” అని రోహిత్ కుమార్ తెలిపారు.కరోనా సంక్షోభం వల్ల ఆన్లైన్ కొనుగోళ్లు పెరిగిన నేపథ్యంలో వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకు ఈ-కామర్స్ సంస్థలు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ సూచించింది. అందులో భాగంగా విక్రేతల చిరునామా, ఫిర్యాదుల అధికారి వంటి వివరాలను తప్పనిసరిగా వినియోగదారులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. ఈ మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమ వర్గాలకు సీసీపీఏ మార్గదర్శకాలు జారీ చేసింది. తాజాగా నకిలీ రివ్యూలకు అడ్డుకట్ట వేసేందుకు వచ్చే వారంలో మార్గదర్శకాలు విడుదల చేయనుంది. ఇవి అమలైతే.. నకిలీ రివ్యూలతో కొనుగోలుదారులను మోసం చేస్తున్న విక్రయదారులకు చెక్ పడినట్లే.