సినిమా అంటే లేనిదాన్ని సృష్టించడం మనకు తెలుసు. ఓ కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరిస్తారనే తెలుసు. కానీ అది కాస్త రివర్స్ అవుతోంది. ఉన్న ప్రపంచాన్ని లేకుండా చేస్తున్నారు కొందరు మేకర్స్ . సినిమాల కోసం ప్రృతితో చెలగాటం ఆడుతున్నారు.
సినీ మేకర్స్ చేష్టలు ఈ మధ్య హద్దులు దాటుతున్నాయి. సినిమాల కోసం కొందరు మరీ బరితెగిస్తున్నారు. మామూలుగా సినిమాల్లో నిజమైన జంతువులను చూపెట్టడమే నేరంగా చెప్తున్నాయి చట్టాలు. ప్రకృతి, జీవజలానికి చేటుచేసే విధంగా ఎలాంటి చర్యలు ఉండకూడదని స్పష్టం చేస్తున్నాయి. కానీ కొందరు మేకర్స్ ఇది పట్టడం లేదు. ముఖ్యంగా సినిమాల కోసం పచ్చటి అడవులను కబలిస్తున్నారు. సహాజత్వం ఉట్టిపడేందుకు అడవుల వైపు అడుగులు వేస్తూ.. వచ్చేటప్పుడు వాటిని మాయం చేస్తున్నారు. సినిమాల్లో తుపాకులతో బుల్లెట్ల వర్షం కురిపించినట్టు, ఒంటిచేత్తో వందల మందిని నరికేసినట్టు.. సెట్టు కోసం ప్రకృతితో చెలగాటం ఆడుతున్నారు. దీంతో ఇద్దరు హీరోలు తమ షూటింగ్స్ కాస్త బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది.
పేరుకే భారీ సినిమాలు… భారీ బడ్జెట్లు… కానీ మినిమం కామన్ సెన్స్ లేకుండా పోతోంది ఆయా మేకర్స్ కు. ఒకరు ఇద్దరు కాదు తోప్ సినిమాలు అని చెప్పుకునేవాళ్లంతా చీప్ గా బిహేవ్ చేస్తూ విమర్శలు మూటగట్టుకుంటున్నారు.
కెజిఎఫ్ చిత్రం ఫేమ్ యశ్ నటిస్తున్న తాజా చిత్రం టాక్సిక్. డ్రగ్స్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ మూవీ కోసం తెగ కష్టపడుతున్నాడు రాకింగ్ స్టార్. అయితే షూటింగ్ లో భాగంగా అడవి బాటపట్టిన మేకర్స్ వివాదంలో పడ్డారు. కొన్ని రోజుల క్రితం బెంగళూరు లోని HMT ల్యాండ్స్‌లో షూటింగ్ ను మొదలు పెట్టారు. ఇక్కడ భారీ సెట్‌ను కూడా వేశారు మేకర్స్. అయితే ఈ సినిమా షూటింగ్ కోసం ఆ భూమిలో చెట్లన్నీ నరికేశారన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో ప్రభుత్వాధికారులు రంగంలోకి దిగి గతంలో శాటిలైట్ చిత్రాలను.. ఇప్పుడున్న పరిస్థితిని సమీక్షించారు. చెట్లు నరికేసినట్లు నిర్థారించుకుకున్న అధికారులు… మేకర్స్ కు నోటీసులు అందజేశారు. దీంతో షూటింగ్ కు అంతరాయం కలగడంతో పాటు ఆ ప్రాంతంలో షూటింగ్ ను ఆపేశారు. సేమ్ ఇలాంటి పరిస్థితినే రిషబ్ ఎదుర్కొంటున్నాడు.
కన్నడ హీరో రిషబ్ శెట్టి నటిస్తున్న లేటెస్ట్ మూవీ కాంతార ప్రీక్వెల్.. కాంతార సినిమా గ్రాండ్ సక్సెస్ కావడంతో అంతకు మించి అనేలా ప్రీక్వెల్ ను తెరకెక్కిస్తున్నాడు. భారీ బడ్జెట్… భారీ క్యాస్టింగ్ తో నెవర్ బిఫోర్ అనేలా ప్లాన్ చేస్తున్నాడు. ప్రజెంట్ కర్ణాటకలోని కుందాపూర్, గవిగుడ్డ అడవి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతోంది. కాంతారలో హీరో తండ్రి అడవుల్లో అర్థంతరంగా మాయమైపోతాడు. అదే పాయింట్ తో ప్రీక్వెల్ ను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ప్రకృతికీ నడుమ జరిగే పోరాటం కోసం అడవిప్రాంతంలో షూటింగ్ చేస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీపై అడవి బిడ్డలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షూటింగ్ లో భాగంగా అడవికి నిప్పు పెట్టారని ఆరోపిస్తున్నారు. అంతేగాకుండా.. షూటింగ్ కోసం పేలుడు పదార్థాలు ఉపయోగిస్తున్నారని… దీనివలన అడవిలో ఉన్న పక్షులతో పాటు మూగజీవాలు భయాందోళనకి గురవుతున్నట్టు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. ఈ విషయంలో గ్రామస్తులకు చిత్రబృందానికి మధ్య వివాదం తలెత్తింది. దీంతో షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు మేకర్స్. ఇలా భారీ సినిమాలు వివాదంలో చిక్కుకుపోవడం హాట్ టాపిక్‌గా మారుతోంది.