సంధ్య థియేటర్ దుర్ఘటనలో గాయపడిన శ్రీతేజ్‌ ప్రస్తుతం కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై హీరో అల్లు అర్జున్ తన స్పందనను వ్యక్తం చేస్తూ, బాధ్యతను స్వీకరించారు. ఆయన ట్వీట్‌లో, “నేను నిత్యం శ్రీతేజ్‌ గురించి ఆలోచిస్తున్నాను. ఈ దురదృష్టకర ఘటన జరిగింది. ప్రస్తుతం శ్రీతేజ్ చికిత్స పొందుతున్నాడు. లీగల్‌ ప్రొసీడింగ్స్ కారణంగా ప్రస్తుతం ఆ పిల్లాడిని కలవలేకపోతున్నాను. అయితే, అతని వైద్య అవసరాలు మరియు కుటుంబ బాధ్యతలను పూర్తి స్థాయిలో తీసుకుంటాను. అతను త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను,” అని తెలిపారు.

అల్లు అర్జున్, పుష్ప-2 టీమ్ బాధ్యతతో ముందుకు
సంధ్య థియేటర్ ఘటన తరువాత పుష్ప-2 టీమ్‌తో పాటు, దర్శకుడు సుకుమార్‌, నిర్మాతలు రవిశంకర్‌, నవీన్‌ ఎర్నేని, బన్నీవాస్‌ అంతా తీవ్ర మనస్థాపంలో ఉన్నారు. శ్రీతేజ్‌ ఆస్పత్రి ఖర్చులన్నీ మైత్రీ మూవీ మేకర్స్‌తో పాటు హీరో అల్లు అర్జున్ భరిస్తున్నారు. దుర్ఘటన జరిగిన రోజు నుంచి ఆసుపత్రి ఖర్చులు తమ బాధ్యతగా తీసుకున్నారు.

ఆరోగ్య సపోర్ట్‌కి ప్రత్యేక చర్యలు
శ్రీతేజ్‌ చికిత్సలో అవసరమైన అత్యంత ఖరీదైన ఇంజెక్షన్ సింగపూర్ నుంచి తెప్పించడంతో పాటు, వైద్య సేవలకు ఎలాంటి ఆర్థిక ఇబ్బంది కలగకుండా ముందడుగు వేశారు. హీరో అల్లు అర్జున్ ఇటీవల 25 లక్షల రూపాయల సహాయం ప్రకటించడమే కాకుండా, భవిష్యత్‌లో కూడా ఎలాంటి అవసరం ఉన్నా అండగా ఉంటానని తెలిపారు.

బన్నీవాస్‌ హాస్పిటల్‌ సందర్శనలు
నిర్మాత బన్నీవాస్ తరచుగా ఆసుపత్రికి వెళ్లి శ్రీతేజ్‌ ఆరోగ్య పరిస్థితులపై సమాచారం తెలుసుకుంటున్నారు. పుష్ప-2 టీమ్‌ తరపున కూడా శ్రీతేజ్‌ ఆరోగ్యంపై నిరంతరం అప్‌డేట్‌లు తీసుకుంటున్నారు.

మంచి కోలుకోవాలని అందరి ఆకాంక్ష
శ్రీతేజ్‌ త్వరగా కోలుకోవాలని, ఆయను పూర్తి ఆరోగ్యంతో తిరిగి చూడాలని పుష్ప-2 టీమ్‌తో పాటు అభిమానులు అందరూ ఆకాంక్షిస్తున్నారు.