ప్రస్తుత పరిస్థితుల్లో మధుమేహం కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ వ్యాధి ఒకప్పుడు వృద్ధులను మాత్రమే ప్రభావితం చేసేది. కానీ, ఇప్పుడు చిన్న వయస్సు వారు కూడా దీనికి గురవుతున్నారు. షుగర్ పేషెంట్లు ఏం తినాలి? ఏం తినకూడదు? అనే సందిగ్ధంలో ఉంటారు, ఎందుకంటే తగిన జాగ్రత్తలు పాటించకపోతే రక్తంలో చక్కెర స్థాయి ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంటుంది. డయాబెటిస్ వల్ల కిడ్నీ వ్యాధులు, గుండె జబ్బులు, కంటి చూపు బలహీనత వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ పరిస్థితుల్లో, డయాబెటిక్ పేషెంట్లు వేరుశెనగలు తినవచ్చా? తింటే ఎలాంటి ప్రభావం ఉంటుందనే ప్రశ్నలతో కొందరు మధనపడతారు.
వేరుశెనగలలో లభించే పోషకాలు
వేరుశెనగలు సూపర్ ఫుడ్ గాను, పోషకపదార్థాలతో నిండిన ఆహారంగా పేరుగాంచాయి. వీటిలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్ B6, విటమిన్ B9, యాంటీఆక్సిడెంట్లు, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల శరీరానికి సమృద్ధిగా ఆవశ్యకమైన పోషకాలు అందుతాయి.
డయాబెటిస్ పేషెంట్లు వేరుశెనగ తినవచ్చా?
బ్రిటీష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం, ఉదయాన్నే వేరుశెనగ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించవచ్చు. వేరుశెనగలో ఉన్న మెగ్నీషియం డయాబెటిస్ పేషెంట్లకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాదు, వేరుశెనగ తినడం వల్ల అనేక ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
వేరుశెనగల ప్రయోజనాలు :
కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది
వేరుశెనగలలో ఉండే ఫైబర్, ప్రోటీన్, మోనోశాచురేటెడ్ కొవ్వు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. గుండెజబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది
వేరుశెనగను ‘పేదవారి బాదం’ అని పిలుస్తారు. ఇది మంచి కొలెస్ట్రాల్ పెంచి, శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
వేరుశెనగ తినడం వల్ల పొట్ట నిండిన అనుభూతి కలుగుతుంది, తద్వారా అతిగా తినడం తగ్గుతుంది. ఇది బరువు నియంత్రణలో సహాయపడుతుంది. ఎప్పటికప్పుడు జాగ్రత్తలు పాటించండి ..డయాబెటిస్ పేషెంట్లు వేరుశెనగలను అధికంగా కాకుండా, పరిమితి లో తీసుకోవాలి. రుచికి నూనె లేదా ఉప్పు జతచేయకుండా తినడం ఉత్తమం.