భారత స్టార్ పేసర్ మోహ్మద్ షమీకి సంబంధించి తాజా గుడ్ న్యూస్ వచ్చేసింది. టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ, షమీని ఐదో టీ20 మ్యాచ్‌లో జట్టులోకి తీసుకునే అవకాశముందని వెల్లడించారు.

2023లో వన్డే వరల్డ్ కప్ సమయంలో గాయపడిన షమీ, అప్పటి నుండి కొన్ని నెలలు జట్టులోకి దూరమయ్యాడు. అయితే, ఇంగ్లండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో అతనిని ఎంపిక చేయడం, అతని ఫిట్‌నెస్ గురించి నెగటివ్ ఊహాగానాలు ఉన్నప్పటికీ, అభిమానుల మధ్య ఉత్సాహాన్ని పంచింది.

ఈ సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌లలో షమీ బెంచ్‌కి పరిమితమయ్యాడు, ఇది అతడు పూర్తి స్థాయిలో ఫిట్‌గా లేకపోవచ్చనే చర్చలకు దారితీసింది. అయితే, రాజ్‌కోట్‌లో జరిగిన మూడో టీ20లో అతను ఆడాడు. ఈ మ్యాచ్‌లో 3 ఓవర్లు వేసిన షమీ, 25 పరుగులు ఇచ్చి వికెట్ తీసేలోపోవడంతో, భారత్ 26 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత పూణేలో జరిగిన నాలుగో టీ20లో షమీ మళ్లీ బెంచ్‌కి పరిమితమయ్యాడు.

మోర్కెల్ మాట్లాడుతూ, “షమీ చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు. వార్మప్ మ్యాచ్‌లలో శర వేగంగా బౌలింగ్ చేస్తున్నాడు. అతను తిరిగి జట్టులోకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. వ‌చ్చే ఐదో టీ20లో షమీని ఆడిస్తాం. అతని అనుభవం యువ ఆటగాళ్లకు ప్రేరణగా ఉంటుంది. భారత బౌలింగ్ దళాన్ని నడిపించే సత్తా ఉన్న బౌలర్ షమీ” అని తెలిపారు.

ఈ వ్యాఖ్యలు షమీ అభిమానులకు ఆనందాన్ని కలిగించాయి. తదుపరి ఐదో టీ20లో షమీ యొక్క ప్రదర్శన టీమిండియాకు ఎంతటి కీలకమవుతుందో చూడాలి.