సింహం పడుకుంది కదా అని దాని జూలుతో జడ వేయకూడదు..పెద్దపులి పలకరించింది కదా అని పక్కన నిల్చొని ఫొటో తీయించుకోకూడదురోయ్! అనేది ఓ సినిమా డైలాగ్. సినిమాల్లో చూపించినట్లు పులితో ఫైటింగ్ అంతా ఫేకే..దాని పక్కన నిల్చోవాలంటే గజగజ వణకాల్సిందే. కానీ రియల్ లైఫ్‌లో ఆ ఎక్స్‌పీరియెన్స్‌ను మీకు అందించేందుకు రెడీ అయ్యింది అటవీ శాఖ. పెద్దపులిని పలకరించడమే కాదు..అడవుల్లో అవి తిరిగే చోట ప్రకృతి ఒడిలో విహరించే ఛాన్స్ అందిస్తోంది . అంతే కాదు పెద్ద పులులు ఎన్నున్నాయో వాటిని లెక్కించే అవకాశాన్ని కల్పిస్తామంటున్నారు అటవీశాఖ అధికారులు. అదేలాగో తెలియాలంటే లెట్స్ వాచ్ దిస్ వీడియో.
ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన జంతువుల్లో పులి ఒకటి. భారతదేశంతో పులికి ఓక ప్రత్యేకమైన సంబంధం ఉంది. అందుకే ఇది మన దేశ జాతీయ జంతువుగా నిలిచింది.1973లో భారత జాతీయ జంతువుగా పెద్ద పులిని ప్రకటించారు. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ప్రకారం 2010లో మన దేశంలో పులుల సంఖ్య 1706. 2022 సంవత్సరం నాటిని దాని సంఖ్య 3682కి చేరింది. ప్రపంచ పులుల జనాభాలో మూడు వంతుల కంటే ఎక్కువ సంఖ్య భారతదేశంలోని అడవులు, జాతీయ ఉద్యానవనాలు , టైగర్ రిజర్వుల్లో నివసిస్తున్నాయి. దేశంలో దాదాపు 1లక్షా 38వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో పులులు విస్తరించి ఉన్నాయని NTCA నివేదికలు చెబుతున్నాయి. ఈ గణాంకాల ద్వారా పులుల సంరక్షణలో భారతదేశం సాధించిన ఘనతను మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇతర ఏ దేశం కూడా ఈ సంఖ్యకు దగ్గరగా రానే రాలేదు. ప్రభుత్వ పరిరక్షణ ప్రాజెక్టులు,అడవుల సంరక్షణ చర్యలు,వేటను అరికట్టడం, పులుల ఆవాసాలను రక్షించడం, తగినంత ఆహారం లభించేలా చూడటం వల్ల దేశంలో పులులు సురక్షితంగా నివసిస్తున్నాయి. హాయిగా విహరిస్తున్నాయి.
ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే …ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జరుగుతుంది. ఆయా రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులను బట్టి నవంబర్ లేదా మార్చి మధ్యలో ఈ ఎస్టిమేషన్ ప్రక్రియను కంప్లీట్ చేస్తారు. ఇందులో భాగంగా తెలంగాణలో నవంబర్ 20 నుంచి 26 వరకు వారం రోజుల పాటు పులుల లెక్కింపు జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో త్వరలో డేట్స్ ను కన్ఫామ్ కానున్నాయి. ఇందులో అటవీ అధికారులతో పాటు విద్యర్థులు, ప్రకృతి ప్రేమికులు, ఎన్జీవోలు పాల్గొంటారు. వాలంటీర్లకు శిక్షణ ఇస్తారు. పులల గణన పూర్తయిన తర్వాత రాష్ట్రాల వారీగా పెద్దపులులు, చిరుతల సంఖ్యను కేంద్రం ప్రకటిస్తుంది.
వన్యప్రాణుల గణాంక సేకరణ దేశంలోని అన్ని అటవీ ప్రాంతాల్లో జరుగుతుంది. అటవీ సిబ్బంది రోజూ సుమారు నాలుగైదు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి పులులతో పాటు ఇతర వన్యప్రాణుల ఆధారాలను అన్వేషిస్తారు. పెద్ద పులులు ఇతర జంతువులను ప్రత్యేక, పరోక్ష ఆధారాల ద్వారా లెక్కించి అంచనా వేస్తారు. వీటి గణాంకాల సేకరణ కోసం అటవీ శాఖ అధికారులు ఐదు పద్దతులను ఫాలో అవుతున్నారు. అటవీ సిబ్బంది నడిచే మార్గంలో వన్యప్రాణులు కనిపిస్తే వెంటనే వాటి గుర్తులతో పాటు ఏ ప్రదేశంలో ఎంత సమయానికి కనిపించాయనే వివరాలను నమోదు చేసుకుంటారు. పగ్ మార్క్ విధానంలో సిబ్బంది అడవిలో నడుచుకుంటూ పులుల పాదముద్రలను గుర్తిస్తారు. పాదముద్రలు ఏ ప్రాంతంలో, ఏ సమయంలో గుర్తించినది నమోదు చేసుకుంటారు. పాదముద్ర ఎన్ని సెంటీమీటర్ల మేర ఉందనేదాన్ని బట్టి పులి వయసును నిర్ణయిస్తారు. అడవుల్లో కనిపించే పులుల మలాన్ని సేకరించి , సిలికాన్ జెల్ ఉన్న డబ్బాలో పెట్టి వాటికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి పులుల సంఖ్యతో పాటు వాటి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటారు . అటవీ సిబ్బంది చెట్లు, రాళ్లపై పడ్డ గాట్లను పరిశీలించి అక్కడ సేకరించిన వెంట్రుకలు, గోళ్లకు డీఎన్ఏ పరీక్ష చేసి ఆ జంతువు ఏదన్నది నిర్ధారిస్తారు.అలాగే కెమెరా ట్రాప్ ల ద్వారా వాటిని గుర్తిస్తారు.
అల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ అంటే కేవలం పులులు, చిరుతల లెక్కింపు మాత్రమే కాదు. అడవులు ఎంత సజీవంగా ఉన్నాయో తెలుసుకునే మంచి అవకాశం. కాలుష్య రహిత, రణగొణ ధ్వనులు లేని పచ్చటి ప్రకృతిలో మమేకమై.. అడవులను అర్థం చేసుకుంటూ వన్యప్రాణుల జీవన గమనాన్ని ప్రత్యక్షంగా తెలుసుకునే అరుదైన అవకాశం ఇది. నవంబరు నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యే ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్- 2006లో డిగ్రీ, పీజీ విద్యార్థులు, ప్రకృతి ప్రేమికులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు వాలంటీర్లుగా పాల్గొనేందుకు వీలుకల్పిస్తోంది అటవీశాఖ. ఆయా జిల్లాల అటవీశాఖ అధికారిని సంప్రదించి వివరాలు అందిస్తే చాలు ఈ నేచురల్ జర్నీలో మీరు పార్టిసిపేట్ చేయవచ్చు. ఇక జంతువుల లెక్కింపులో పార్టిసిపేట్ చేసేవారు ప్రతి రోజు 5 కిలో మీటర్ల పరిధిలో అటవీ ప్రాంతంలో తిరుగుతారు. దాని సిద్ధమైన వారికి మోస్ట్ వెల్కమ్ చెబుతోంది అటవీ శాఖ.