చలికాలం వచ్చిందంటే రేగు పండ్ల సీజన్ మొదలవుతుంది. వీటిని జుజుబి పండ్లుగా కూడా పిలుస్తారు. రోడ్ల పక్కన బండ్లపై నాటుగా విక్రయించే ఈ పండ్లు చిన్నవయస్సు నుంచే అందరికీ తెలిసినవి. కాయలుగా వగరు రుచితో ఉండే రేగు పండ్లు పండినప్పుడు తియ్యగా, రుచిగా మారతాయి. ఈ చెట్లు 5-7 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి. ఆసియా ఖండంలోని అనేక ప్రాంతాల్లో ఇవి విరివిగా కనిపిస్తాయి. ఇండియన్ డేట్స్‌గా కూడా పిలిచే ఈ పండ్లు పలు పోషకాలతో నిండివుంటాయి. ఈ చలికాలంలో వీటిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.
రేగు పండ్లలో ఉన్న పోషకాలు
రేగు పండ్లలో ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. ఈ పండ్లు శరీరానికి అవసరమైన పోషణను అందిస్తూ, అనేక ఆరోగ్య సమస్యలను నివారించడంలో సహాయపడతాయి.
రేగు పండ్ల ఆరోగ్య ప్రయోజనాలు
1. బరువు తగ్గించడంలో సహాయపడతాయి
రేగు పండ్లలో ఎక్కువగా ఫైబర్ ఉండటం వల్ల ఆకలి అదుపులో ఉంటుంది. ఇది క్యాలరీలను తక్కువగా అందిస్తుంది, అధిక బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. ప్రొటీన్లు కూడా సమృద్ధిగా ఉండటం వల్ల శరీరానికి శక్తి అందిస్తుంది.
2. షుగర్ నియంత్రణ
డయాబెటిస్ ఉన్నవారు రేగు పండ్లను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయి.
3. మంచి నిద్రకు తోడ్పడుతాయి
రేగు పండ్లలో న్యూరో ప్రొటెక్టివ్ గుణాలు ఉన్నాయి. ఇవి మనసును ప్రశాంతంగా ఉంచి మానసిక ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తాయి. మంచి నిద్రకు అవసరమైన మెళకువలను ఇవి కల్పిస్తాయి.
4. గుండె ఆరోగ్యం
ఈ పండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది, ఇది రక్త నాళాలను విస్తరించి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఫలితంగా బీపీ అదుపులో ఉంటుంది. రేగు పండ్లలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు గుండె సంబంధిత సమస్యలను తగ్గిస్తాయి.
5. మలబద్ధకం నివారణ
రేగు పండ్లలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. మలబద్ధకాన్ని నివారించడంలో ఇవి గొప్ప సహాయపడతాయి. రోజూ గుప్పెడు రేగు పండ్లను తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు తొలగిపోతాయి.
6. ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది
రేగు పండ్లలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి, ఇవి శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. అలర్జీలను తగ్గించే యాంటీ హిస్టామైన్ గుణాలు కూడా వీటిలో ఉన్నాయి.
ఎలా తినాలి?
రోజూ గుప్పెడు రేగు పండ్లను తినడం మంచిది. ఎక్కువగా తింటే వేడి చేసే అవకాశాలు ఉండటంతోపాటు విరేచనాలు అవుతాయి. కాబట్టి పరిమితి మాత్రమే పాటించాలి.