ఫార్ములా ఈ-రేస్ నిర్వహణలో చోటుచేసుకున్న అక్రమాల కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ రేస్‌కి తొలి ప్రమోటర్‌గా వ్యవహరించిన ఏస్ నెక్స్ట్ జెన్ సంస్థకు ఆంటీ-కరప్షన్ బ్యూరో (ఏసీబీ) నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్, సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, అలాగే హెచ్ఎండీఏ రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిలను ఏసీబీ విచారించింది. తాజాగా ఏస్ నెక్స్ట్ జెన్‌పై దృష్టి పెట్టడం చర్చనీయాంశమైంది.
రేస్ ఒప్పందం – మొదట్లో ఏం జరిగిందంటే?
2022 అక్టోబర్ 25న కుదిరిన ఒప్పందం ప్రకారం, సీజన్ 9, 10, 11, 12 రేస్‌ల నిర్వహణ ఖర్చులను ఏస్ నెక్స్ట్ జెన్ భరించాలి. హైదరాబాద్‌లో 2023 ఫిబ్రవరిలో సీజన్ 9 రేస్ జరిగింది. కానీ 2024 ఫిబ్రవరిలో జరగాల్సిన సీజన్ 10 రేస్ కోసం ఏస్ నెక్స్ట్ జెన్ ముందుకు రాలేదు.
ఫార్ములా ఈ-రేస్ ఆపరేషన్స్ సంస్థ (FEVO)కు 2023 మేలో రూ.90 కోట్లు చెల్లించాల్సి ఉన్నప్పటికీ, ఏస్ నెక్స్ట్ జెన్ తన వంతు భాద్యతలు నిర్వర్తించలేదు. సీజన్ 9 నిర్వహణతోనే నష్టం వాటిల్లిందంటూ సంస్థ చేతులెత్తేసింది.
హెచ్ఎండీఏ ప్రమోటర్‌గా మారడం – వివాదం ఏంటంటే?
ఏస్ నెక్స్ట్ జెన్ రేస్ నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో, హెచ్ఎండీఏ (హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ) ఈ ప్రమోటర్ పాత్రను తీసుకుంది. నాటి మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు 2023 అక్టోబర్‌లో హెచ్ఎండీఏ రూ.45.71 కోట్లు FEVOకు బదిలీ చేసింది.
ఇప్పుడీ ఫండ్స్ బదిలీ వివాదానికి దారితీసింది. ఏస్ నెక్స్ట్ జెన్ సంస్థ తన బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటికీ, దానిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు అనే అంశంపై ఏసీబీ ఆరా తీస్తోంది.
ఏసీబీ దర్యాప్తు ముమ్మరం
ఫార్ములా ఈ-రేస్ నిర్వహణలో జరిగిన నిధుల కేటాయింపు, ఒప్పంద ఉల్లంఘనలపై ఏసీబీ లోతుగా విచారణ చేపట్టింది. ఇప్పటివరకు ముఖ్య వ్యక్తుల విచారణ ఇప్పటికే పూర్తయింది. ఇప్పుడు ఏస్ నెక్స్ట్ జెన్ సంస్థకు నోటీసులు జారీ చేయడం తదుపరి దర్యాప్తుకు ప్రాధాన్యత ఇస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇంకా ఏం జరుగుతుందో చూడాలి!