నందమూరి బాలకృష్ణ హెల్మెట్ ధరిస్తూ రోడ్ సేఫ్టీపై ప్రజలకి సందేశం

జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల సందర్భంగా హిందూపురం రవాణా అధికారులు నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ, ద్విచక్రవాహనాలు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ప్రాణం పోతే మళ్లీ వస్తుందా? అందుకే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి బైకులు నడపాలి” అని తెలిపారు. అలాగే, కార్లు నడిపేవాళ్లు కూడా సీట్ బెల్టు తప్పనిసరిగా పెట్టుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

“రోడ్డు ప్రమాదాలు రోజుకోలా పెరుగుతున్నాయి. కొన్నిసార్లు మన తప్పు ఉండకపోవచ్చు, కానీ కొన్నిసార్లు మనదే తప్పు అయ్యుండొచ్చు. ప్రమాదం ఎట్నుంచి వస్తుందో తెలియదు. అందుకే వాహనదారులు డ్రైవింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండాలి” అని బాలకృష్ణ పేర్కొన్నారు.

అలాగే, ఇటీవల సోషల్ మీడియాలో బైకులపై స్టంట్లు చేస్తూ పబ్లిసిటీ పొందేందుకు కృషి చేస్తున్న వ్యక్తులను తప్పు పట్టారు. “ఒకరిని చూసి మరొకరు అనుకరిస్తున్నారు. లైకుల కోసం బైకులపై ఫీట్లు చేయడం సరికాదు. జీవితం చాలా విలువైనదని అందరూ గుర్తించాలి. రోడ్డుపై వెళ్లేటప్పుడు ఎక్కడా నిబంధనలు అతిక్రమించవద్దు. బాధ్యత గల పౌరులుగా నడుచుకోండి” అని ఆయన హితవు పలికారు.

ఈ కార్యక్రమంలో, బాలకృష్ణ హెల్మెట్ ధరించి బుల్లెట్ బైకును నడిపి, రోడ్ సేఫ్టీ ప్రమాణాలను చూపించి ప్రజలకు మంచి సందేశం ఇచ్చారు.

తాజా వార్తలు