కాలాన్ని కొలిచేందుకు మనం అనేక కొలమానాల్ని వాడతాము. వాటిలో చాంద్రమాన, సౌరమానాలు ముఖ్యమైనవి. చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే దానిని బట్టి చాంద్రమానంఅంటారు. సూర్యుడు ఒక్కో రాశిని దాటడాన్ని బట్టి సౌరమానం గా లెక్కిస్తారు. సూర్యుడు ప్రవేశించిన సమయాన్ని సంక్రమణం అంటారు . ధనస్సురాశిలో ప్రవేశించిన సమయం ధనుస్సంక్రమణం . కాగా ధనస్సులో సూర్యుడుండే కాలాన్ని ధనుర్మాసం అంటారు.
మానవులకు ఒకసంవత్సరం దేవతలకు ఒకరోజు అంటారు . ఈలెక్కన ఉత్తరాయణం రాత్రి , దక్షిణాయనం పగలుగా భావించబడుతోంది. ఆయా రాశులలో సూర్యుడు సంచరించే కాలమును సౌరమాసం అంటారు .కార్తీకమాసం తర్వాత వచ్చేది మార్గశీర్షం.. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు మాసాలలో… నేను మార్గశీర్షమాసం అని పేర్కొన్నారు. ఈ మాసం సాత్వికమైన ఆరాధనలకు ప్రధానమైనది. కనుక సత్వగుణ ప్రధానమైన విష్ణువును ఈనెలలో ఆరాధిస్తారు. దక్షిణాయనానికి చివర, ఉత్తరాయణం ప్రారంభానికి మధ్య ఉండే నెలరోజులని ధనుర్మాసం అంటారు .ఈ నెల విష్ణుమూర్తికి కూడా చాలా ప్రీతికరమైనది. ఈ ధనుర్మాసంలో తెల్లవారుజాము బ్రహ్మ ముహూర్త కాలం అత్యంత పవిత్రమైనది. ధను అంటే ప్రార్థించడం అని అర్ధం . ఈ నెల రోజులూ జరిగే ఆండాళమ్మ పూజ, తిరుప్పావై , గోదాకళ్యాణం ఇవన్నీ ద్రవిడులకి సంభందించిన సంప్రదాయాలు..అయితే తిరుమలలో మాత్రం ఈ నెలరోజులు ప్రత్యేక ఉత్సవాలలో ద్రవిడుల సంప్రదాయాలనే నిర్వహిస్తారు. సుప్రభాతానికి బదులు తిరుప్పావై పఠనం చేస్తారు. వెంకటేశ్వర స్వామి సహస్రనామార్చనలో తులసికి బదులు బిల్వపత్రాలతో పూజ చేస్తారు .
ధనుర్మాసం శనితో సంబంధం ఉన్నటువంటి మాసం. మార్గశిరలో ప్రారంభమై పుష్య మాసం వరకు ఉంటుంది. 2024లో… ధనుర్మాస ఘడియలు 2024 డిసెంబర్ 16న ( అర్దరాత్రి 12.34) ప్రారంభమై ….2025 జనవరి 14న ముగుస్తాయి. అంటే మకర సంక్రాంతికి ముగుస్తుంది. ధనుర్మాసంలో తెల్లవారుజామున శ్రీమహావిష్ణువును పూజించడం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో విష్ణుసహస్రనామం పారాయణం చేయడం మంచిది .
ధనుర్మాసం నెలరోజులూ సూర్యోదయం, సూర్యాస్తమం సమయంలో దీపారాధన చేయడం వల్ల శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుందని చెబుతారు. వైష్ణవ ఆలయాల్లో ఉదయం అర్చన తర్వాత ప్రసాదాన్ని నివేదించి వాటిని భక్తులకు , పిల్లలకు పంచుతారు. దీన్నే బాలభోగం అంటారు. సూర్యుడు ధనస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశించే వరకు అంటే…. భోగి వరకు ధనుర్మాసం కొనసాగుతుంది.ధనుర్మాసాన్ని శూన్య మాసం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే సాధారణంగా దైవికమైన, పవిత్రమైన కార్యక్రమాలను తప్ప మరేదైనా నిర్వహించకూడదని పండితులు చెబుతున్నారు. ధనుర్మాసం సాధారణంగా డిసెంబర్ మధ్యలో ప్రారంభమవుతుంది. ఈ మాసాన్ని సాధారణంగా పూజా మాసంగా పరిగణిస్తారు. ఈ నెలలో ఆస్తుల కొనుగోలు, కొత్త గృహ ప్రవేశం, నిశ్చితార్థం, వివాహం వంటి ఇతర కార్యకలాపాలు నిర్వహించకూడదు. ఈ షరతులన్నీ మాసం పూర్తిగా భగవంతుని ఆరాధనకే అంకితం కావడానికి అని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ఈ మాసంలో విష్ణువును పూజిస్తే 1000 సంవత్సరాలు విష్ణువును భక్తితో పూజించిన ఫలితం దక్కుతుంది. విష్ణు భక్తులకు ఈ నెల కాలం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో వచ్చే వైకుంఠ ఏకాదశి వేలాది మంది భక్తులు విష్ణుపూజ చేస్తారు.
ఈ నెల ( ధనుర్మాసం) మొత్తం బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి, స్నానాలు ముగించుకుని వేకువజామున పూజలు ప్రారంభించి, సూర్యోదయానికి ముందే పూజలను ముగిస్తారు. దీనిని ధనుర్ పూజ అని కూడా అంటారు. దేవతలకు దక్షిణాయనం రాత్రివేళ, ఉత్తరాయణం పగలు, అయితే ఈ ధనుర్మాసం రాత్రి, పగలు రెండూ కలగలిసి, బ్రాహ్మీ ముహూర్తంలో లేచి స్నానం చేసి, స్వామిని పూజించి, నైవేద్యాలు సమర్పిస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని
భక్తుల నమ్మకం .
ఈ నెల రోజులూ ఇంటి ముందు పండుగ హడావుడిని గుర్తు చేస్తూ నాలుగు వీధుల చిహ్నంగా ముగ్గును తీర్చిదిద్దుతారు. ధనుర్మాసం కూడా చాలా ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిగిన మాసం. వైష్ణవ ఆలయాలలో ఈ మాసాన్ని చాలా విశేషంగా నిర్వహిస్తారు.ధనుర్మాసమంతా.. ఉదయం, సాయంత్రం ఇల్లు శుభ్రం చేసి.. దీపారాధన చేయడం వల్ల మహాలక్ష్మి కరుణా, కటాక్షాలు సిద్ధిస్తాయి.స్నాన, దాన, హోమ, వ్రత పూజలు చేయడం చాలా మంచిది.ధనుర్మాసం వచ్చిందంటే.. ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం కావడం వల్ల వైష్ణవులు ధనుర్మాస వ్రతం ఆచరిస్తారు. గోదాదేవి ధనుర్మాసమంతా విష్ణు వ్రతం చేపట్టి, స్వామిని కీర్తించింది. సూర్యాలయాలు, వైష్ణవాలయాలు సందర్శించడం చాలా మంచిది.అలాగే ఏదైనా ఒక నదిలోకాని లేక ఏదైనా ఒక పవిత్రమైన నదీ పుణ్య జలంలోకాని లేదా ఒక చెరువు లోకాని మీకు తోచిన పుణ్య స్థలంలో ఒక్క మునుగు మునుగిన 4 రెట్లు అశ్వమేధయాగం చేసిన ఫలితము దక్కును .