భారత మ‌హిళా క్రికెట్ జ‌ట్టు ఆల్ రౌండర్ దీప్తి శర్మకు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం భారీ గౌరవం ప్రకటించింది. ఆమెను డీఎస్‌పీ (డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్)గా నియ‌మిస్తూ, జనవరి 27న మొరాదాబాద్ జిల్లాలో ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం, ఆమె క్రికెటర్‌గా దేశానికి చేసిన సేవలకు గుర్తింపుగా తీసుకోవాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది.

ఈ విషయాన్ని దీప్తి శర్మ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వెల్లడించింది. “ఈ మైలురాయిని సాధించినందుకు ఎంతో గ‌ర్వంగా ఉంది. డీఎస్‌పీ పోస్టుతో నా చిన్ననాటి కల నెరవేరింది. నా కుటుంబానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారి అచంచలమైన మద్దతు, ఆశీర్వాదాలు ఈరోజు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టాయి. ఈ అవకాశాన్ని కల్పించిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు. డీఎస్‌పీగా నా విధులను చిత్తశుద్ధితో నిర్వ‌హిస్తాన‌ని హామీ ఇస్తున్నాను” అని ఆమె తన పోస్ట్‌లో పేర్కొంది.

2024లో టీ20 ప్రపంచ కప్ విజయం తర్వాత, తెలంగాణ ప్రభుత్వం హైద‌రాబాదీ బౌలర్ మహమ్మద్ సిరాజ్‌ను కూడా డీఎస్‌పీగా నియమించిన విషయం తెలిసిందే. ఇక, దీప్తి శర్మ ఇప్పుడు భారత క్రికెటర్‌గా ఈ గౌరవం పొందిన రెండవ వ్యక్తి.

గతేడాది, దీప్తి శర్మ వన్డే, టీ20 ఫార్మాట్లలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. వన్డే ఫార్మాట్లో టాప్ వికెట్ టేకర్‌గా నిలిచిన ఆమె, టీ20లో 30 వికెట్లు సాధించింది. ప్రస్తుతం, ఆమె ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) కోసం సిద్ధమవుతోంది.

ఈ సీజన్‌లో, దీప్తి శర్మ యూపీ వారియర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ, జట్టుకు కెప్టెన్‌గా ఉన్న ఆమె టైటిల్ గెలవాలని ఆశిస్తోంది. గత సీజన్‌లో, బెంగాలూరు రాయల్ ఛాలెంజర్స్ (ఆర్‌సీబీ) విజేతగా నిలిచింది, అలాగే మొదటి సీజన్‌లో ముంబయి ఇండియన్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.

దీప్తి శర్మ ఈ ప్ర‌త్యేక గౌరవంతో మరింత ఉత్సాహంగా క్రికెట్ కెరీర్‌ని కొనసాగించనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *