ఇంటగెలిచారు కానీ రచ్చ గెలవలేకపోతున్నారు కోలీవుడ్ డైరెక్టర్లు. లోకల్ గా దుమ్ము రేపినా పరభాషల్లో మినిమం హిట్ కొట్టలేకపోతున్నారు. తెలుగులో మరీ దారుణంగా పరాజయం పాలవుతున్నారు.

కోలివుడ్ డైరెక్టర్ లు తెలుగు లో నేరుగా సినిమాలు చేయడం ఎప్పటినుంచో వస్తున్న సంప్రదాయమే. గతంలో కే.బాలచందర్, మణి రత్నం, కే.యస్.రవికుమార్, సురేష్ కృష్ణ, మురగదాస్ వంటి వాళ్లు తెలుగులో సినిమాలు తీసి మెప్పించే ప్రయత్నం చేశారు. తాజాగా ఈ లిస్టులో దర్శకుడు శంకర్ కూడా చేరారు. అయితే తమిళంలో భారీ హిట్లు అందుకున్న దర్శకులు.. తెలుగులో అనుకున్న స్థాయిలో తమ మేనియాను సాగించలేకపోవడం ఇండస్ట్రీలో చర్చనీయాంశం గా మారుతోంది.

కోలీవుడ్ లో భారీ హిట్లు అందుకున్నా… తెలుగులో కనీసం సేఫ్ గేమ్ ఆడలేకపోతున్నారు. అగ్ర దర్శకులకు కూడా సక్సెస్ అందని ద్రాక్ష అయిపోయింది.

తెలుగులో తొలిసారిగా సినిమా చేస్తూ.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ అంటూ స్ట్రెయిట్ సినిమా చేసినప్పటికీ… దర్శకుడు శంకర్ తన క్రేజ్ ను క్యాష్ చేసుకోలేకపోయాడన్న టాక్ నడుస్తోంది. శంకరే కాదు చాలా మంది కోలీవుడ్ దర్శకులు తెలుగులో తడబడ్డారు. అక్కినేని నాగచైతన్య హీరోగా తెరకెక్కిన ‘కస్టడీ’ మూవీతో తెలుగులోకి అడుగుపెట్టారు డైరెక్టర్ వెంకట్ ప్రభు. పక్కా హిట్ అవుతుందనుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. చైతన్య గతంలో కృష్ణ మారిముత్తు తో చేసిన ‘యుద్ధం శరణం’ సినిమా తీవ్ర నిరాశ పరిచింది. ఇక రామ్ పోతినేనితో కోలీవుడ్ డైరెక్టర్ ఎన్. లింగుస్వామి ‘ది వారియర్’ అనే చేసి ఘోరమైన డిజాస్టర్ ను అందుకున్నాడు. ఇక సముద్రఖని తెరకెక్కించిన బ్రో మూవీ సోసో టాక్ ను సొంతం చేసుకోగా… అంతకు ముందు’శంభో శివ శంభో’.. ‘జెండా పై కపిరాజు’ చిత్రాలు కూడా నిరాశనే మిగిల్చాయి.

మహేశ్ బాబు, పవన్ కల్యాణ్, ప్రభాస్ లకు సైతం తమిళ దర్శకుల నుంచి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ నే వచ్చింది. రాఘవ లారెన్స్ తెరకెక్కించిన రెబల్…. ఎస్టే సూర్య మహేష్ కాంబోలో వచ్చిన స్పైడర్… ఏ ఆర్ మురగదాస్ తో చేసిన నాని ఫ్లాపులుగా మిగిలాయి. ఇక ధరణి డైరెక్షన్ లో వచ్చిన బంగారం, విష్ణువర్థన్ తెరకెక్కించిన పంజా కరుణాకరణ్ తెరకెక్కించిన బాలు యావరేజ్ గా నిలిచాయి. ఆనంద్ శంకర్ డైరక్షన్ లో విజయ్ దేవరకొండ నటించిన ‘నోటా’ మూవీ డిజాస్టర్ అయింది. డైరెక్టర్ సిరుతై శివ రవితేజ హీరోగా చేసిన ‘దరువు’ సినిమాలు ఫెయిల్ అయ్యాయి. చిరంజీవి, అక్కినేని నాగార్జున, నందమూరి బాలకృష్ణ, వెంకటేష్ లాంటి సీనియర్ హీరోలకు కూడా తమిళ దర్శకులతో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఏదేమైనా సొంత బాషలో వండర్స్ క్రియేట్ చేసిన కోలీవుడ్ దర్శకులు…. తెలుగులో సత్తా చాటలేకపోవడం ఆశ్చర్చాన్ని కలిగిస్తోంది.