రాష్ట్రంలో రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని అర్హులందరికీ రేషన్ కార్డులు అందే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు.
రేషన్ కార్డుల జాబితా– అర్హులకు ఆందోళన అవసరం లేదు
ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, కొత్తగా ప్రకటించిన రేషన్ కార్డుల జాబితాలో పేర్లు రానివారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి తెలిపారు. కులగణన, సామాజిక, ఆర్థిక సర్వే వివరాల ఆధారంగా, పాత రేషన్ కార్డుల సమాచారం ప్రకారం అర్హుల వివరాలను ప్రభుత్వం నమోదు చేసిందన్నారు.
గ్రామ సభల్లో మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు
అర్హులైన వారెవరైనా కొత్త జాబితాలో పేరు లేకపోతే, గ్రామ సభల్లో మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి సూచించారు. దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ రేషన్ కార్డు అందజేస్తామని హామీ ఇచ్చారు.
అవగాహన కార్యక్రమాలు, స్పష్టమైన మార్గదర్శకాలు
రేషన్ కార్డుల జారీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అర్హులందరికీ ఈ సమాచారం అందేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
రాష్ట్రంలో పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని, నూతన రేషన్ కార్డుల జారీని ప్రభుత్వం ప్రామాణికంగా, సమర్థవంతంగా నిర్వహిస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.