తిరుపతి లడ్డూ వ్యవహారం: సుప్రీంకోర్టుకు లెటర్ పిటిషన్, జోక్యం కోరుతున్న న్యాయవాది

తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిపినట్టు వచ్చిన ఆరోపణలపై సుప్రీంకోర్టుకు పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌లో సత్యం సింగ్ అనే న్యాయవాది, ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌కు లేఖ రాస్తూ, హిందూ మతాచారాలను అతిక్రమించడం పై తక్షణంగా జోక్యం చేసుకోవాలని కోరారు.

గత ప్రభుత్వ హయాంలో తిరుమలలో లడ్డూ ప్రసాదం తయారీలో జంతు కొవ్వు ఉపయోగించినట్టు తాజా పరిశీలనలో వెల్లడయింది. ఈ చర్య హిందూ మత విశ్వాసాలను ఉల్లంఘించడమే కాకుండా, రాజ్యాంగంలోని ఆర్టికల్ 25(1) ప్రకారం మత స్వేచ్ఛపై దాడి చేసినట్టుగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రసాదం తయారీ మరియు పంపిణీ హిందూమత ఆచారంలో ప్రధాన భాగమని, పవిత్ర నైవేద్యాన్ని మాంసాహారంతో కలుషితం చేయడం ద్వారా భక్తుల హక్కులను దెబ్బతీసేలా ఉంటుందని సత్యం సింగ్ తెలిపారు.

అలాగే, ప్రభుత్వ నియమిత అధికారుల పర్యవేక్షణలో ఈ ఉల్లంఘనలు జరిగినందున, ఈ విషయం పై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తిరుమల లడ్డూ వ్యవహారం, మన పవిత్ర సంస్థల నిర్వహణకు సంబంధించి పెద్ద సమస్యలను తెరవడాన్ని ఈ పిటిషన్ లో పేర్కొన్నారు.