గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేసిన “గేమ్ చేంజర్” చిత్రం బ్లాక్ బస్టర్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా శంకర్ డైరెక్షన్ లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ చిత్రం, జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ తో చిత్రం సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది.
ఈ నేపథ్యంలో, ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్ దేవా తన పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక నిర్ణయం తీసుకున్నారు. చిన్నారుల కోసం ఢిల్లీలో “గేమ్ చేంజర్” స్పెషల్ షో వేయించారు. వందలాది చిన్నారులతో కలిసి ఆయన ఈ సినిమా చూసారు.
ఈ ఘటనపై వీరేంద్ర సచ్ దేవా తన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. “పిల్లలు దేవతలతో సమానం. వారు దేవుడి ప్రత్యేక దూతలు. నా పుట్టినరోజు సందర్భంగా చిన్న పిల్లలతో కలిసి గేమ్ చేంజర్ సినిమా చూశాను. ఆ సినిమాను తెరపై చూస్తున్నంత సేపు ఆ పిల్లల ముఖాల్లో కనిపించిన సంతోషంతో కూడిన చిరునవ్వులు, ఉద్విగ్నతను నా జీవితాంతం నా జ్ఞాపకాల్లో పదిలంగా నిలుపుకుంటాను” అని అన్నారు.
ఈ ప్రత్యేక షోకు హాజరైన చిన్నారుల ఆనందం, చిగురించిన చిరునవ్వులు, వారి ఉత్సాహం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీరేంద్ర సచ్ దేవా ఈ అద్భుతమైన అనుభవాన్ని జీవితాంతం గుర్తు చేసుకుంటానని చెప్పారు.
ఈ సందర్భంగా “గేమ్ చేంజర్” చిత్రంపై ప్రేక్షకుల అభిప్రాయాలు ఇంకా మరింత పాజిటివ్‌గా వస్తున్నాయి, సరికొత్త ఎంటర్టైన్మెంట్ దశలోకి అడుగుపెట్టిన ఈ సినిమా అందరి హృదయాలను గెలుచుకుంది.