న్యూఢిల్లీలోని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నివాసంలో ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ మర్యాదపూర్వకంగా ఆయనను కలిశారు. ఈ సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి లోకేశ్ వివరిశారు.
ఈ భేటీలో, ఏపీలో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని మంత్రి లోకేశ్ కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కోరారు. డిఫెన్స్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉందని, కాబట్టి కొన్ని యూనిట్లు ఏపీకి వచ్చేందుకు కేంద్రం సహకరించాలని ఆయన సూచించారు.
మాజీ ప్రభుత్వం అస్తవ్యస్తంగా తయారుచేసిన రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి దిశలో నడిపిస్తున్నామని, కేంద్రం అందిస్తున్న సహకారంతో అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం పనుల పురోగతి గురించి కూడా ఆయన వివరించారు. “గత పాలకుల అనాలోచిత విధానాలతో రూ. 10 లక్షల కోట్ల అప్పుల బారిన పడిన రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం ఆక్సిజన్ అందిస్తూ, అభివృద్ధి దిశగా సాగించేలా సహకరిస్తోంది” అని మంత్రి లోకేశ్ అన్నారు.
అలాగే, ప్రధాని నరేంద్ర మోదీ వికసిత్ భారత్ లక్ష్యంతో ఏపీని అభివృద్ధి బాటలో నడిపించేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నట్టు ఆయన చెప్పారు.
ఈ సమావేశంలో, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస వర్మ, ఎంపీలు పాల్గొన్నారు.
కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్, రాష్ట్ర అభివృద్ధికి తమవంతు సహాయం అందించడానికి సిద్దమని హామీ ఇచ్చారు.