రాష్ట్రపతి ప్రసంగం అనంతరం, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు లోక్ సభలో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. ప్రతి ఏడాది బడ్జెట్ ప్రవేశానికి ముందు పార్లమెంట్ ఉభయ సభల ముందు ఆర్థిక సర్వేను సమర్పించడం భారత సాంప్రదాయం. ఈ నేపథ్యంలో, నిర్మలా సీతారామన్ ఈ రోజు లోక్ సభలో ఆర్థిక సర్వేను సమర్పించి, గత సంవత్సరంలో దేశ ఆర్థిక పరిస్థితి, రాబోయే సంవత్సరంలో ఎదురయ్యే సవాళ్లపై సమాచారాన్ని అందించారు.
ఈ సందర్భంగా, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా సభను శనివారానికి వాయిదా వేశారు. ఆర్థిక సర్వేలో, దేశ ఆర్థిక వ్యవస్థ యొక్క గత సంవత్సరం పనితీరును, అలాగే రాబోయే ఏడాది ఆర్థికంగా ఎదురయ్యే సవాళ్లను ముందుగానే అంచనా వేసి తెలిపే ప్రయోజనాన్ని ప్రస్తావించారు.
ఆర్థిక సర్వేను 1950-51 సంవత్సరం నుండి బడ్జెట్‌తో పాటు ప్రవేశపెట్టే విధానం కొనసాగింది. అయితే, 1960 తరువాత బడ్జెట్‌కు ఒక రోజు ముందు ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టే సంప్రదాయం ప్రారంభమైంది. ఈ సర్వేను ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఎకనామిక్ అఫైర్స్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఎకనామిక్ విభాగం రూపొందిస్తుంది.
అయితే, రేపు (ఫిబ్రవరి 1) ఉదయం 11 గంటలకు కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ సమీక్షకు సంబంధించిన మొదటి విడత సమావేశాలు ఫిబ్రవరి 13 వరకు జరుగుతాయి. అనంతరం, రెండవ విడత బడ్జెట్ సెషన్లు మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకూ జరగనుంది.
ఈ ఆర్థిక సర్వే, కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక వ్యూహాలను రూపొందించడానికి దారితీయే ఒక కీలక దశగా ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.