ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడిచారని, ప్రత్యేక హోదా హామీతో మోసం చేశారంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శల వర్షం కురిపించారు.
విభజన హామీలపై మోదీ చర్యలపై ఆమె నిరాశ వ్యక్తం చేస్తూ, ఆయన విశాఖపట్నం పర్యటన సందర్భంగా పలు కీలక అంశాలను ప్రస్తావించలేదని పేర్కొన్నారు. “విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద వైఖరి ఏంటో కూడా చెప్పలేదని,” ఆమె అన్నారు. “ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కడప స్టీల్ ప్లాంట్ గురించే మాట్లాడలేదు,” అని మండిపడ్డారు.
మోదీతో టీడీపీ, జనసేన పొత్తును షర్మిల తీవ్రంగా విమర్శించారు. “ఏపీ ప్రజలను మోసం చేసిన మోదీతో చంద్రబాబుది సక్రమ సంబంధమైతే, జగన్‌ది అక్రమ సంబంధం,” అని ఆమె పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్, రాజశేఖర్ రెడ్డి ఆశయాలను త్యజించారని ఆమె విమర్శించారు.
“రాజశేఖర్ రెడ్డి గారు మతతత్వ బీజేపీకి ఎప్పుడూ వ్యతిరేకంగా నిలిచారు. కానీ ఆయన వారసులమని చెప్పుకునే జగన్ బీజేపీతో సహకరించడం ఏమిటి?” అంటూ ప్రశ్నించారు. బీజేపీ వ్యతిరేక పోరాటం చేసే పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని షర్మిల స్పష్టం చేశారు.
“దేశాన్ని రక్షించుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ అవసరం,” అంటూ ఆమె దేశవ్యాప్త రాజకీయాల్లో కాంగ్రెస్ పాత్రపై నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
ఈ సందర్బంగా షర్మిల తన ట్విట్టర్ వేదికగా మోదీ, జగన్, చంద్రబాబుపై విమర్శల ప్రహారం కొనసాగించారు:
“మోదీ రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. హోదా ఇస్తామని మోసం చేశారు. ఆయనతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబూ, సహకరిస్తున్న జగన్ కూడా ఈ ద్రోహానికి బాధ్యులు. బీజేపీ వ్యతిరేక పోరాటానికి కాంగ్రెస్ మాత్రమే సరైన పార్టీ.”
రాష్ట్ర రాజకీయాల్లో కొత్త దిశగా మార్పుల కోసం షర్మిల ప్రకటనలు ఎంతటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి.
ఏపీ ప్రజలను ప్రధాని మోడీ @narendramodi దారుణంగా వెన్నుపోటు పొడిచారు. హోదా ఇస్తామని మోసం చేశారు. మొన్న మోడీ విశాఖ వచ్చినప్పుడు కనీసం విభజన హామీలపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. విశాఖ స్టీల్ మీద ఎటువంటి ప్రకటన లేదు. ప్రైవేటీకరణ మీద వైఖరి ఏంటో చెప్పలేదు. ఉత్తరాంధ్ర-రాయలసీమకు ప్రత్యేక… pic.twitter.com/RGuZjUOcrn
— YS Sharmila (@realyssharmila) January 10, 2025