ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్, కర్ణాటకలోని మైసూరు క్యాంపస్‌లో దాదాపు 400 మంది ట్రైనీలను ఉద్యోగం నుంచి తొలగించింది. ఈ ప్రక్రియలో విఫలమైన ఎవాల్యుయేషన్ పరీక్షల కారణంగా వారు ఉద్వాసన పలికినట్టు సమాచారం. జాతీయ మీడియా కథనాల ప్రకారం, 2024లో ట్రైనీలుగా చేరిన వారిలో సగం మందిపై ఈ చర్య తీసుకోబడింది.
ఇన్ఫోసిస్, ఫ్రెషర్ల నియామకంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. గత ఏడాది ఫ్రెషర్లను విధుల్లోకి తీసుకున్న కంపెనీ, ఇప్పుడు 2024 బ్యాచ్‌లో చేరిన 400 మందిని ఉద్యోగం నుండి తొలగించడం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వారితో ‘మ్యూచువల్ సెపరేషన్’ లెటర్లపై సంతకాలు చేయించుకున్నట్టు సమాచారం.
వీరు వరుసగా మూడు ఎవర్యూయేషన్ పరీక్షలలో ఫెయిల్ అవడంతో, ఇన్ఫోసిస్ వారు ఉద్యోగం నుంచి తప్పించారనేది అధికారిక వెర్షన్. అయితే, ఈ లేఆఫ్స్ గురించి ఇన్ఫోసిస్ ఎప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.
ఒక ట్రైనీ మాట్లాడుతూ, ‘‘పరీక్షలను సులభంగా జరపాలని మా అభిప్రాయం ఉన్నప్పటికీ, వాటిని చాలా కఠినంగా ఉంచారని చెప్పాడు. ఈ విధంగా చర్య తీసుకోవడం అన్యాయమని భావిస్తున్నాను’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
2022-23 నియామక ప్రక్రియలో భాగంగా, ఇన్ఫోసిస్ 2,000 మందిని క్యాంపస్ సెలెక్షన్ల ద్వారా ఎంపిక చేసింది. సిస్టమ్ ఇంజినీర్, డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజినీర్ వంటి పోస్టుల కోసం వీరిని ఎంపిక చేసి ఆఫర్ లెటర్లు ఇచ్చింది. ఈ 2,000 మందిలో 2022 బ్యాచ్ ఉత్తీర్ణులే అయినప్పటికీ, ఉద్యోగంలో చేరేందుకు గడువు 2024 ఏప్రిల్ నెల వరకు ఆలస్యమైంది. దీనిపై ఇన్ఫోసిస్ పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి, అలాగే కార్మిక శాఖ వద్ద కూడా ఫిర్యాదులు నమోదయ్యాయి.
ఇప్పుడు, ఈ ట్రైనీలలో సగం మందిని వదిలించుకునే ప్రయత్నం జరుగుతున్నట్టు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.